StatCounter code

Wednesday, July 6, 2011

పరీక్షలమ్మో పరీక్షలు !

ఈ మధ్య పిల్లలందరూ పరీక్షలు, ర్యాంకులనీ తెగ హడావుడి చేసేసారుగా...అవన్నీ చూస్తే నా పరీక్షల హడావుడిగుర్తొచ్చింది.

చిట్టి సౌమ్యకి పరీక్షలతో ఎన్ని కష్టాలో! అసలు చిన్నప్పటినుండీ పరీక్షలంటే అస్సలు ఇష్టముండదు...వెధవ పరీక్షలుఎందుకొస్తాయో అని విసుక్కునేది. చిన్నప్పటినుండీ ఇష్టమున్న పని చాలా హాయిగా చేస్తూ ఇష్టం లేని పని అస్సలుచేసేది కాదు. అదే సూత్రం పాఠాలకీ వర్తించేది. ఇష్టమున్న సబ్జెక్టులు బాగా చదివి, ఇష్టం లేనివి పక్కకు పెట్టేసేది. దానితోపరీక్షలొచ్చేసరికి ఎడతెగని కష్టాలు పాపం! పరీక్షలయిపోయిన రోజు ఇంక పండగే పండగ. :)

ఓసారి తొమ్మిదో క్లాసులో ఏం జరిగిందంటే....(ఇంక "ఉత్తమ స్త్రీ" లోకొచ్చేస్తా :P).

ఆఫ్ ఇయర్లీ పరీక్షలన్నమాట. చివరి పరీక్ష సోషలు. ఆ సోషల్ టీచర్ మహా కరుకు...ఆవిడని చూస్తే పిల్లలందరికీ వణుకు. ఒకే ఒక్క తిట్టు తిట్టేదావిడ..."నవరంధ్రాలు మూసుకుని పాఠం వినండి". అంతే ఎక్కడ దొంగలు అక్కడే గప్‌చుప్. ఈ ఆఫ్ ఇయర్లీ పరీక్షలలో లాస్ట్ పేపర్ సోషలు-ఆవిడది. తలుచుకుంటేనే నాకు ఉత్సాహం వెల్లివిరిసింది...ఆహా ఇంకొక్క రోజు...ఇంకొక్క పరీక్ష....అంతే ఇంక సెలవులిచ్చేస్తారుఅని మురిసిపోతున్నాను. అదే ఆనందాన్ని మనసులో నింపుకుని పొద్దున్నే బడికెళ్ళి పరీక్ష బరికేసాను. ఒక అరగంట ముందే రాసిపారేసాను. రాయడం ముగియడమేమిటి, క్లాసు నుండి బయటకి ఒక్క అంగలో దూకబోతుంటే వెనుకనుండి ఆ సోషలు టీచర్ కంచు కంఠం..."రేపు బడి ఉంది, ఎల్లుండి నుండి సెలవులు. రేపు వచ్చేటప్పుడు అసైన్మెంట్ చేసి తీసుకురా" అని వినిపించింది. ఆ..ఇంత పెద్ద పరీక్షే రాసేసాను, అసైన్మెంట్ ఓ లెక్కా అని గ్రౌండ్ కి పారిపోయాను. నాలాగే ఉత్సాహం ఉరకలు వేస్తున్న స్నేహితులు కనిపించారు...వారందరితో పిచ్చాపాటి వేసి, పెద్దపండగ (సంక్రాంతి) కి ఏమేమి కొనుక్కున్నామో ముచ్చటించి తీరికగా మధ్యాన్నం భోజనాలవేళకి ఇల్లు చేరుకున్నా. సుష్ఠుగా తినేసి, కమ్మటినిద్ర తీసి, సాయంత్రం నాన్న ఇంటికొచ్చేసాక బోలెడు కబుర్లు చెప్పేసి, పుస్తకాల సంచి తీసా...సర్దుకుందామని, అసైన్మెంట్ చేద్దామని. అందులో చిత్తు కాగితాలన్నీ ఏరిపారేస్తూ ఒకచోట ఆగిపోయాను. పెద్ద ఠావులు కట్ట. తెల్లకాగితాలు దొంతిగాపెట్టి మధ్యకి మడవబడి ఉన్నాయి. ఓ 5-6 కాగితాలుండొచ్చు. నేను చిత్తు ఎప్పుడూ ఇలా పధ్ధతిగా మడతబెట్టనే, అయినా ఠావు కాగితాలపై చిత్తు రాయనే, ఇవేంటబ్బా! అని విస్మయం చెందుతూ తెరిచి చూసా...నేను పొద్దున్న రాసిన సోషల్ పరీక్ష- జవాబు పత్రం...ఇదెలా వచ్చింది నా సంచీలోకి? అంతా అయోమయంగా అనిపించింది. కెవ్వుమని కేకేసి, కళ్ళుతిరిగిపడిపోయినంత పని చేసాను. మా నాన్నారు పరిగెత్తుకుంటూ వచ్చారు "ఏమయిందమ్మా" అంటూ. నాకు మెల్లిగా విషయం బోధపడింది....పొద్దున్న పరీక్షలయిపోయాయనే సరదాలో జవాబుపత్రం టీచరుకి ఇవ్వకుండా, మడిచి సంచీలో పెట్టేసుకునాను. మరి ప్రశ్నాపత్రం ఏమయినట్టు? సంచీ అంతా వెతికా....కొంపదీసి జవాబు పేపర్ కి బదులు ప్రశ్నాపత్రం టీచరుకిచ్చానా! :O కళ్ళలో నీళ్ళు...కాళ్ళు, చేతులు వణుకు....నోట మాట పెగలట్లేదు. నా చేతిలో కాగితాలందుకుని నాన్నచూసి "ఇదేమిటే" అని అడిగారు. అదే నాకూ అర్థం కావట్లేదు...ఇదెలా నా సంచిలోకొచ్చింది....అయ్యో అసలే ఆవిడ చండశాసనురాలు....ఏమిటి దారి? అప్పుడు మా నాన్నారికి గుర్తొచ్చింది ఆవిడ ఇల్లు మన వీధికి ఎదురువీధేగా..."ఇంటికెళ్ళి ఇచ్చిరా పో" అన్నారు. "అమ్మో, నాన్నా చింతకర్రుచ్చుకుని కొడతారేమో"? nangih "అబ్బా, ఏం కాదులే, వెళ్ళీ రామ్మా..ఇచ్చేసి పొరపాటయిపోయిందడీ అని సారీ చెప్పి రా" అన్నారు. నేను భయం భయంగా, బెరుకుగా బయలుదేరాను వాళ్ళింటికి. వెళ్ళి తలుపు తట్టాక...టీచరు వచ్చారు. "ఏంటి ఈ టైములో వచ్చావు" అని గడియారంచూసారు....రాత్రి 7.30. "ఏం లేదు టీచరు, ఇది మీకిచ్చి వెళదామని"...నసిగాను. నా చేతిలో కాగితాలు అందుకుని, చూసి నావైపు ఒక్క చూపు చూసారు...ఆవిడ కళ్ళలో ఎర్రని జీరలు...నాకు ఏడుపొక్కటే తక్కువ."అది కాదు టీచర్, పొరపాటు...చూసుకోలేదు. కావాలని చేసినది కాదు టీచర్...సంచిలో కనిపించగానే తెచ్చి ఇచ్చేసాను. నేనేమీ మార్చలేదు టీచర్...ఒట్టు, నిజంగా పొరపాటునే జరిగిందండీ" అని బిక్కమొహంతో చెప్పా. ఆవిడేమీ అనలేదు..."మ్మ్ సరే, వెళ్ళి రా" అన్నారు. బ్రతుకుజీవుడా అనుకుంటూ ఒక్క గెంతులో బయటకి దూకి, ఇంటికి పరుగో పరుగు. కానీ నాకింకా ఆశ్చర్యం...ఆ కాగితాలు చూసి టీచరు నిప్పులు కక్కుతారనుకున్నా, ఏమీ అనలేదు...బాబోయ్ మిన్ను విరిగిమీదపడదు కదా! ఏ కళనున్నారో ఏమో, తిట్టకుండా వదిలేసారు అనుకుంటూ హాయిగా నిద్రపోయా. మర్నాడు బడికెళ్ళా గెంతుకుంటూ. ఆరోజు ఇంట్రబిల్లు (అప్పట్లో మేము అలాగే అనేవాళ్ళం :D) లో స్టాఫ్ రూము నుండి పిలుపొచ్చింది. ఇంక చూసుకోండి...అందరు టీచర్ల మధ్యన పెట్టి నన్ను ఎడాపెడా వాయించేసారు. నా మీదా కక్షగట్టి ఉన్న మా ఇంగ్లీషు మేషారు విజృంభించేసారు. నన్ను అభిమానించే సంస్కృతం, తెలుగు, సైన్సు టీచర్లు నన్ను కాపాడాలాని శతవిధాలా ప్రయత్నించారు. మా సోషల్ టీచర్ ఆగితే కదా...ఎంత ధైర్యం చూడండి....పైగా రాత్రి మా ఇంటికొచ్చి ఆ కాగితాలన్నీఇచ్చింది. ఎంత పొగరో చూడండి...అల్లరి మితిమీరిపోతున్నాది. లాభం లేదు దీని అంతు చూస్తా. HM కి కంప్లైంట్ ఇస్తాను. ఈ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు. ఓ సంవత్సరం పరీక్షలు రాయకపోతే సంకటం కట్టేస్తుంది" అని భీభత్సంగా అరుపులు. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. భగవంతుడా...ఏ తీరుగ నను చూసెదవో, నా తరమా ఈ బడిసాగరమీదను...అని మనసులో పాడుకుంటూ, "ఆహా మహాతల్లీ ఇందుకా నిన్న రాత్రి ఏమీ అనకుండా పంపించేసావు..మర్నడు ఈ ప్రోగ్రాం పెట్టాలని ఆలోచనతోనేనా" అని మనసులో తిట్టుకుంటూ, ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ బ్రతిమాలడం మొదలెట్టాను...ఇంకెప్పుడూ అలా చేయనండీ. పోరపాటున జరిగింది. కావాలని చేసినదికాదు. నా తప్పే, ఒప్పుకుంటున్నా...మన్నించండి అంటూ ఏవో చెప్పాను. చివరికి మిగతా టీచర్లు కూడా నాతో కలిసి ఆవిడని శాంతింపజేసి "ఇలాంటి పనులు జీవితంలో ఎప్పటికీ చెయ్యనని" ప్రమాణం చేయించడం కోసం హారతి పళ్ళెం, భగవద్గీత వెతికారు, కానీ దొరకలేదు. అప్పుడు ఉత్తినే ప్రమాణం చేయించారు...నేనూ ఉత్తుత్తినే ప్రమాణం చేసేసా ;) హమ్మయ్య....గండం గడిచింది అనుకుంటూ పరుగెత్తుకుంటూ, పడుతూ లేస్తూ, దొర్లుతూ, పిల్లిమొగ్గలేస్తూ క్లాసురూమ్‌కి చేరిపోయాను.
................................................

బడి వదిలి కాలేజీలో చేరడం. ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ లో చేరడం జరిగింది. డిగ్రీలో నాది MES ( maths, eco, stats). మా కాలేజీలో stats ఉన్న గ్రూపులు మూడు MPS (maths, pysics, stats), MES and CES (commerce, eco, stats). MPS, MES వాళ్ళకి maths, stats కలిపే క్లాసులవుతాయన్నమాట. పెద్ద సంతలా ఉండేది. CES వాళ్ళకి stats చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఏదో మీన్, మోడ్, మీడియన్...మహా అయితే correlation చెబుతారు అంతే. అంత ఈజీ గా ఉంటుందన్నమాట. ఇంక మాకు యేడాదికి మూడు ఇంటర్నల్స్ (40మార్కులు), ఒక ఎక్స్‌టర్నల్(60 మార్కులు) ఉండేది. ఇంటర్నల్ లో బాగా రాసిన రెండు పరీక్షల మార్కులుతీసుకుంటారు అన్నమాట. మనం డిగ్రీ చివరి సంవత్సరం లో ఉన్నాం. stats మొదటి ఇంటర్నల్ ఎగ్గొట్టాం (ఏదో బలమైనకారణం ఉండే ఉంటుంది, నాకు ఇప్పుడు గుర్తులేదుగానీ) :). రెండో ఇంటర్నల్ సరిగ్గా రాయలేదు...12/20 వచ్చాయి. అమ్మో మూడోది బాగా రాసి మార్కులు తెచ్చుకోకపోతే కష్టం. 20 లేదా కనీసం 18 అయినా తెచ్చుకోవాలి. అప్పుడే 30/40 వస్తాయి అని లెక్కలేసుకుని బాగా చదివేసా. పరీక్ష మధ్యాన్నం 2.00 కి. నా హాల్ టికెట్ నంబర్ అదీ చుసుకుని వెళ్ళి పరీక్ష గదిలో కూర్చున్నా. మొదటి బెంచీలో రెండో సీటు.....వెనక్కి తిరిగి చూస్తే స్నేహితులంతా పలకరించారు. మేషారు పేపర్లిచ్చారు. మొదటి ప్రశ్న చూసా...డెడ్ ఈజీ. రెండో ప్రశ్న...అరే చాలా సింపులూ....మూడోది...ఓహ్హొహ్హో బహు సులభం...నా పంట పండిందనుకున్నా . అయినా ఇంత ఈజీగా ఇచ్చారేమిటబ్బా పేపరూ అనుకుంటూ చాయిస్ లో ప్రశ్నలకి కూడా జవాబులు రాసేసి అరగంటలో పూర్తి చేసేసా (గంట పరీక్షన్నమాట). వెనక్కి తిరిగి చూసా...ఫ్రెండ్స్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ, రాసేస్తున్నారు. మూడో బెంచీలో ఫ్రెండు తలెత్తిచూసి, అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యం గా చూసాడు. "ఆ, ఈజీ కదా" అని నా మొహంలో భావం...తనకు మరింత విస్మయం! రెండో బెంచీలో పిల్ల అనుమానంగా చూసింది...అసలు ఇది పరీక్ష రాసిందా లేదా అన్నట్టు. వీళ్ళంతా ఎందుకబ్బా ఏదో చాలా కష్టమైన పేపర్ రాస్తున్నట్టు ఫోజు కొడుతున్నారు...ఓవర్ ఏక్షన్ లే అనుకుంటూ పేపర్ ఇచ్చేసి బయటికొచ్చేసాను. గంట కి ఓ పది నిముషాల ముందు ఓ ఫ్రెండు పరీక్ష పూర్తి చేసి బయటికొచ్చింది. ఆ పిల్ల నన్నుచూస్తూనే బాగా రాసావా? అంది. పేపర్ చింపేసాను...డెడ్ ఈజీ కదా అన్నాను. ఆ పిల్ల ఆశ్చర్యంగా "అవునా, రెండోప్రశ్నకి ఏం రాసావు" అని అడిగింది పేపర్ చేతికిస్తూ. నేను అందుకుని రెండో ప్రశ్న చూసా...ఇదేంటి ఈ ప్రశ్న నేను రాయలేదే, నేను చూడలేదే అసలు! మొదటి ప్రశ్న చూసా...అయ్యయో ఇదీ లేదే...మూడోది...ఉహూ...అమ్మో ఏంటి ఈ ప్రశ్నలు...నేను ఈ పరీక్ష రాయలేదు..మరి నేను రాసినదేమిటి? నా పేపర్ విప్పి చూసాను...వేరే ప్రశ్నలు. ఇదేలా సాధ్యం!....నాకు బుర్ర తిరిగిపోయింది. ఆ అమ్మయికి చూపించా...తనకీ కళ్ళు తిరిగాయి. ఇద్దరిలో ఎవరిదో తప్పో అర్థంకాలేదు. ఈలోగా మిగతా కొందరు బయటికొచ్చారు. ఓ నలుగురైదుగురి దగ్గర పేపర్లు తీసుకు చూసా...వాళ్ళందరివీ ఒకేలా ఉన్నాయి. నాదే వేరుగా ఉంది. బాబోయ్...ఏమిటీ వైపరీత్యం? విధి మళ్ళీ నాతో ఏనాటకం ఆడబోతోంది? :( నేనే పరీక్ష రాసానసలు? అందరం ఒకే హాల్లో కూర్చున్నాం. అందరికీ ఒకేలాంటి పేపర్ ఇచ్చారు. మరి నేనేం రాసాను? ఈ సందేహాలతో కాళ్ళు, చేతులు వణుకుతుండగా ఇన్విజిలేటర్ దగ్గరకెళ్ళి నా గోడు వెళ్ళబోసుకున్నా. ఆయన కూడా మొదట కొంత గందరగోళానికి గురి అయీ రెండూ పేపర్లూ దగ్గర పెట్టుకుని తీక్షణం గా పరిశీలించి చూస్తే......నేను రాసిన పేపర్ మీద హెడ్డింగ్ లో BA STATISTICS EXAM FOR CES అని తాటికాయంత అక్షరాలతో రాసుంది. అది చూసి ఢాం అని కిందపడిపోయా. జరిగిందేమిటంటే మా stats పరీక్ష పత్రాలలో పొరపాటున CES stats పేపర్ ఒకటి కలిసింది. అదీ, రాక రాక నాకే వచ్చింది. నేను వెనక ముందు చూసుకోకుండా తిన్నగా ప్రశ్నలు చూడడం మొదలెట్టాను. ఈజీగా ఉన్నాయని చెప్పి రాసి పారేసాను. పోనీ అంతా సులువుగా ఉన్నప్పుడైనా ఇది మా పేపరేనా అని డౌటు రావాలా నాకు? కాస్త తల యెత్తి చూసుంటే తెలిసేది. పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్ లో రాసుంది...కానీ నేను చూడలేదు. ఈ విషయం గ్రహించేసరికి పరీక్ష టైము అయిపోయింది. ఒక అరగంట టైం ఇవ్వండి...పరీక్ష రాసేస్తాని అని ఇన్విజిలేటర్ ని బతిమాలుకున్నాను....ఊహూ, ససేమిరా అన్నారు. నాకు ఏడుపొచ్చేసింది...అయ్యో ఉన్న ఒక్క పరీక్షా పోయింది, ఏమిటి నా గతి! మూడు ఇంటర్నల్స్ లో ఒక్కటే రాస్తే ఎక్స్‌టర్నల్ కి allow చెయ్యరు. నాకు కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టనిపించింది. ఏం చెయ్యలో తోచలేదు. వెంటనే eco dept వైపు పరిగెట్టా. మా మావయ్యగారు అక్కడ లెక్చరర్....ఆయన ఆరోజు సెలవుట. తెలుగు డిపార్ట్మెంట్ కి పరిగెట్టా...మా అత్తయ్య అక్కడ లెక్చరర్. తనూ సెలవులో ఉందిట. ఎటూ పాలుపోక మావయ్యగారికి ఫోన్ చేసాను. ఆయన అంతా విని కాసేపయ్యక మళ్ళీ ఫోన్ చెయ్యి అని పెట్టేసారు. ఈలోగా నా క్లాస్మేట్స్ లో కొందరు దరిద్రులు నన్ను తెగ భయపెట్టారు...ఇంక నీ పని అంతే. డిగ్రీ ఫైనల్ ఇయర్ stats exam పోయింది. మళ్ళీ యేడాది మళ్ళీ రాసుకోవడమే. సాధారణంగా ఇలా మళ్ళీ పరీక్ష రాయడానికి allow చెయ్యరు అంటూ నానా కూతలూ కూసారు. నాకు గుండె జారిపోయింది. అయినా మావయ్యగారు, అత్త ఉన్నారుగా ఏదో ఒకటి చేస్తారులే అని ఏదో మూల ధైర్యం మిణుకుమిణుకుమంటూన్నది. మావయ్యగారు, కాలేజీలో తన ఫ్రెండ్స్/తోటి లెక్చరర్లకి ఫోన్ చేసి నా సంగతి చూడమన్నారు. ఆయనకి చాల క్లోజ్ అయిన ఇంకో లెక్చరర్ ని కలవమన్నారు. ఆయన్ని కలిస్తే "అలా ఎలా రాసేసావమ్మయ్...చూసుకోవద్దూ" అని నాలుగు తిట్టి ప్రిన్సిపల్ దగ్గరకి తీసుకెళ్ళి, అన్నీ వివరించి...పొరపాటున జరిగింది, ఇందులో ఇన్విజిలేటర్ తప్పు కూడా కొంచం ఉంది... పేపర్లు చూసుకోకుండా ఇచ్చాడు కాబట్టి ఈ అమ్మాయికి మళ్ళీ చాన్స్ ఇవ్వండి అని మనవి చేసారు. వెంటనే ప్రిన్సిపల్, నన్నుఇంకో నాలుగు తిట్టేసి, ముఖ్యమైన లెక్చరర్లతో సమావేశమయ్యి ఒక నిర్ణయానికొచ్చారు....ఓ గంటలో కొత్తగా పేపర్ సెట్ చేసి ఇస్తారు.....దాన్ని నేను అరగంటలో రాసివ్వలి. హమ్మయ్య అనుకుని వెంటనే ఒప్పేసుకున్నాను. నాకు తెలుసు ఈసారి పేపర్ కష్టంగా ఇస్తారని. ఆ గంటలో మళ్ళీ పుస్తకాలు అన్నీ తిరగేసి, తరువాత ప్రిన్సిపల్ ముందే కూర్చుని అరగంటలో పరీక్ష రాసేసి ఇచ్చేసాను. నేను రాసిన రెండు పేపర్లూ దిద్దబడ్డాయి. CSE stats లో 20/20. మా stats లో16 వచ్చాయి . కాలేజీలో నా పేరు మారుమ్రోగిపోయింది. కొందరు లెక్చరర్లు అన్నారుట...చూడు ఆ అమ్మాయికి ఎన్నితెలివితేటలో, ఏ పేపర్ ఇచ్చినా బాగా రాసేసింది" అని. :D ఈ సంగతి మా అత్త, మావయ్యగారికి చెబితే వాళ్ళు చచ్చేట్టు తిట్టారు...సిగ్గులేదూ ..వెధవ పని చేసేసి మళ్ళీ గొప్పలొకటి అని. అమ్మ, నాన్నా మెత్తగా చివాట్లు పెట్టారు. ఈ విషయం ఎవరికి ఎవరు చెప్పారో ఏమొగానీ మా బంధురబంధురబంధు గణానికంతటికీ తెలిసిపోయింది. ఒక ఫంక్షన్ లో మా పెద్దనాన్నగారి కూతురి అత్తగారు నన్ను పిలిచి అడిగారు "అలా చేసావుట కదా, పరిక్షలో అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మాయ్" అని సాగదీసుకుంటూ. :( దేవుడా...నా ప్రతిభ దశదిశాలా వ్యాపించిందా....జిల్లాలు దాటి పాకిందా అనుకుంటూ మనసులో ఏడ్చుకున్నా. :( ఇలా ఒక రోజు కాదు, ఒక మనిషి కాదు. మొత్తం అందరికీ తెలిసిపోయింది. సంవత్సరం పాటు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇదే అడగడం....పిచ్చెక్కిపోయింది. నేను ఊరు వదిలి హైదరాబాదుకి ప్రయాణమవుతున్నప్పుడు (యూనివర్సిటీ లో జాయిన్ అవ్వడానికి) కూడా అందరూ ఇదే చెప్పారు. పరీక్షా పత్రాన్ని హెడింగ్ తో సహా క్షుణ్ణంగా చదువు, తరువాత రాయి అని. ఈ గోల దాదాపు ఓ యేడాదిన్నర వరకూ సాగింది.
...............................................

అక్కడితో అయిపోయిందా, లేదు...MA లో కొచ్చేసరికి పరీక్షలు ఎక్కువయిపోయాయి....ఎంత విసుగొచ్చేసిందో...నాజీవితంలో ఈ పరీక్షల అధ్యాయం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూసేదాన్ని. ఓసారి మా ఇంటర్నల్స్ ముందు హైదరాబాదులో ఏదో భీభత్సం జరిగింది....మర్నాడు బహుసా సెలవు ప్రకటించవచ్చు అని ఊహాగానాలు సాగాయి. మర్నాడు నాకు ఇంటర్నల్...అందులోనూ నాకు అస్సలు ఇష్టం లేని సబ్జెక్ట్...ఆహా ఇంక పరీక్ష ఉండదు అని సంబరపడుతూ, పుస్తకాలూ మూసేసి, దుప్పటి కప్పుకుని పడుకుండిపోయా. కానీ నా దురదృష్టవశాత్తు మర్నాడు పరీక్ష ఉన్నాది, నేను రాసాను. 5/20 వచ్చాయి...అవే నాకు MA లో వచ్చిన అతి తక్కువ మార్కులు. ఎలాగోలా externalలో కాసిన్ని మార్కులు తెచ్చుకుని పాస్ అయ్యాననిపించుకున్నాను. మార్కులు ఇచ్చేరోజు ఆ సబ్జెక్ట్ టీచర్ పిలిచి "నీకుమిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులొచ్చాయి, ఏమ్మా ఇందులో మాత్రం పాస్ మార్కులు వచ్చాయి. నీకు నేను నచ్చలేదో, నా పాఠాలు నచ్చలేదో" అని నొచ్చుకున్నారు. అప్పుడు ఎందుకో నాకు చాలా గిల్టీగా అనిపించింది....చ చ ఆయన్నిబాధపెట్టానా అనిపించింది. లేదండీ...నాకు ఆ సబ్జెక్ట్ అంటే అంత ఇష్టం లేదు అని నిర్మొహమాటంగా చెప్పేసాను. ఆయనకూడా సరే నీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుకుని బాగా పైకి రా అని దీవించి పంపేసారు. ఇంక phd కొచ్చాక...హమ్మయ్య ఇంక నా జీవితంలో పరీక్షలు రాయక్కర్లేదు అనుకుని తెగ సంబరపడ్డాను.

ఇంక ఫైనల్ టచ్ ఈ పోస్ట్ కి...నాకు జీవితంలో వచ్చిన ఒకే ఒక సున్న. :P
కాగితం పైన నా పేరు పక్కన, మేథ్స్ టాలెంట్ స్పెల్లింగ్ చూడడం మరచిపోకండి!
(బొమ్మ పెద్దది కావడానికి ఇమేజ్ మీద నొక్కండి)




చూసారా నా మేథ్స్ టాలెంట్......ఇంకెప్పుడూ నన్ను లెక్కల గురించి అడగకండి. :D
కానీ తరువాతి సంవత్సరం జరిగిన జిల్లాస్థాయి Maths Talent Test లో నాకు మొదటి బహుమతి వచ్చింది....అదే మరి మేజిక్ అంటే! :P

అదీ నా పరీక్షల ప్రహసనం. :)


45 comments:

కొత్తావకాయ said...

హ్హహ్హాహ్హా.. నవరంధ్రాలూ మూసుకొని ఎన్ని పాఠాలు "చేతులూపుకుంటూ" వినేవాళ్ళమో గుర్తుందే నీకూ!:p
అవునూ! ఎనిమిదవ తరగతి పేపరు ఇంత భద్రం గా, ఏ తవ్వకాల్లో బయటపడిందే తల్లీ! నీ చేతి రాత చూసి నేనూ చిన్ననాటి పరీక్షల రోజుల్లోకి ఎగిరివెళ్ళి , సమాధానాలు రాయకుండానే వచ్చేసా!

రాజ్ కుమార్ said...

వి.టా.హా.. + ద్రౌ.న
మొదటీ ఇన్సిడేంట్ కేకో కేకా.. హహ్హా..
ఇక రెండవ ఇన్సిడేంట్ కి సేం పించ్.. ఇంటర్ లో నాకు కూడా ఇలాగే అయ్యిందీ.. ఎగ్జామ్ సింపులుగా ఉందనీ ఇరగదీసా.. తర్వాత తెలిసింది అది మా సెక్షన్ పేపర్ కాదనీ.. ముందుగానే చూడబట్టీ సరిపొయిందీ.. హిహిహిహి..

ఇక మీ ఎనిమిదవ తరగతి ఎగ్జామ్ పేపర్ లో మార్కులు అరుపులు.. హహహ. .మీ హ్యాండ్ రైటింగ్... అబ్బబ్బ్బా... అధ్బుతం.. పాపం మీ సార్. ఎలా కరెక్ట్ చేశారో ఏమిటో ;) ;)

kEka pOst..సెగట్రీ గోరూ..

నైమిష్ said...

మీ 8థ్ క్లాస్ పేపర్లు చూసి కిం ప దొ న....ఇప్పటికీ తీపి గుర్తుగా భలే దాచుకున్నారు..ముఖ్యంగా లెక్కల పక్కన చేసిన చిత్తు ( రఫ్ ) వర్క్ కూడా చాలా బాగ చేశారు..అలా ఒక్కసారి నేను స్కూల్ రోజులకి వెళ్ళి పోయాను..

గిరీష్ said...

హహా..బాగున్నాయండి మీ పరీక్షల ప్రళయాలు..
అలా అలా నేను ఓ సారి నా చిన్నప్పటి పరీక్షల సమయాన్ని గుర్తుచేసుకున్నాను. సబ్జె‌క్ట్స్ ఇష్టమైతే టీచర్లు ఇష్టముండరు, టీచర్లు ఇష్టమైతే సబ్జె‌క్ట్స్ ఇష్టముండవు..:)

కొత్త పాళీ said...

కేక.
ఇంటర్నల్స్ - ఎక్స్‌టర్నల్స్ - ఏ కాలేజి ఏ బేచి చూసినా ఇదే చరిత్ర! విద్యార్ధుల చరిత్ర మొత్తం పరీక్షలకి బానిసత్వం:)
ఇంక పీహెఛ్‌డీలోకొచ్చాక ఓపెన్ బుక్ ఎగ్జాంస్ అంటే ఎగిరి గంతేశాను. కానీ వాటికంటే మామూలుపరీక్షలే వెయ్యిరెట్లు బెటరని అనుభవమ్మీద తెలిసొచ్చింది. క్వాలిఫయింగ్ ఎగ్జాం రాశాక ఇంక మళ్ళి జీవితంలో పరీక్షకి కూర్చోనని ఒట్టేసుకున్నాను.

లత said...

బావున్నాయి మీ కబుర్లు
నిజమేనండి చదువుకునేప్పుడు పరిక్షలంటే ఎంత విసుగొస్తుందో

SHANKAR.S said...

మొదటి పేరాలో "చిట్టి సౌమ్య" ఎవరూ???? :))))))))))))))

ఇకనుంచీ "ఏ పేపర్ కి జవాబులు రాస్తున్నామో తెలియని వాళ్ళు కూడా చెప్పడమే" అని మిమ్మల్ని ఏడిపించవచ్చని మన బ్లాగ్మిత్రులందరికీ ఐడియా ఇస్తున్నా. కాస్కోండి.

మీ చిన్నప్పటి అసైన్ మెంట్ పేపర్ చూశాక నాకో పెద్ద డౌట్ . మీ పేరులో "U" పోయి "W" ఎప్పటినించీ వచ్చింది?

సుజాత వేల్పూరి said...

అమ్మో, నేనింకా మా పిల్ల రాక్షసికి నిన్ను చూపించి సౌమ్యాంటీ (రెహమాన్ కి కాదులే గానీ నా కూతురికి ఆంటీ వే నువ్వు) లాగా డాక్టరేట్ చెయ్యాలని చెప్తుంటా. నీ లెక్కల పేపర్ చూశాక మొదటికే మోసం వచ్చేట్టుంది. కిందపడి దొర్లి నవ్వుతోంది ఇందాకటినుంచీ!

నీ పరీక్షల హడావుడి మీ జిల్లా నుంచి ఇప్పుడు నీ బ్లాగు వల్ల ప్రపంచానికంతటికీ తెల్సిపోయిందోచ్!

మొత్తానికి "కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది" అని ఏడ్చుకుంటూ పరీక్షలకు చదువుతున్న నన్ను తీవ్రంగా డిస్టర్బ్ చేశావు. ఇందుకు ప్రతీకారంగా నేనివాళ ఇహ చదవకుండా దుప్పటి ముసుగెట్టేయబోతున్నా(అసలే ఇక్కడ చల్లగా వాన కురుస్తోంది)

ఏవిటో, వెధవ పరీక్షలు! అసలు పరీక్షలు లేకుండా చదువులుంటే ఎంత బాగుండో!

మురళి said...

భళా.. భళా.. సోషల్ పరిక్ష రాసిన విధానం బ్రెమ్మాండం.. మా చిన్నప్పుడైతే స్కూల్లో పరిక్షలయ్యాక దిద్దిన పేపర్లిచ్చే ప్రహసనం ఒకటి ఉండేది.. ఆడపిల్లల్ని ఏమీ అనేవాళ్ళు కాదు కానీ, మగ పుట్టుక పుట్టిన పాపానికి మార్కులు గానీ తక్కువొస్తే ఎన్ని దెబ్బలు తినాల్సి వచ్చేదో.. మొత్తానికి ఎక్కడికో తీసుకెళ్ళి పోయారండీ.. ఏమిటో ఇవాళ బ్లాగులన్నీ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళి పోతున్నాయ్..

సృజన said...

:):)

మధురవాణి said...

అబ్బబ్బా.. ఎన్నెన్ని సాహసాలు చేసారండీ మీరసలు.. ఎంత నవ్వుకున్నానో అసలు! :P :D
మీరసలు గ్రేట్ నిజంగా.. ఎంత బాగా దాచి పెట్టుకున్నారు ఆ పేపర్ని.. :))
Superb post!

Srikanth Eadara said...

బాగుందండి...మీ పరీక్షల ప్రహసనం............

Anonymous said...

బాగున్నాయండీ మీ పరీక్షల ముచ్చట్ల. మీతో లాగానే విధి నాతో కూడా పరీక్షల రూపంలో ఓహ ఆట ఆడుకుంది.
మిగతా డిపార్ట్మెంటులేమో కానీ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్సు చదివితే ఒక లాటి వైరాగ్యం రావటం గ్యారంటీ! పెద్దవి, చిన్నవి, పొట్టివీ, పొడుగువీ, రాతవీ, మాటవీ ఓ- బోలెడు పరీక్షలు. పరీక్షలు కాగానే ఒక కష్టమైన ఇంటర్వ్యూ చేసి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సైంటిస్టు గా ఉద్యోగం కొట్టేసాను. ఇహ మనకి జీవితంలో డోకా లేదు, కాలు మిద కాలేసుకొని కూర్చోవటమే అనుకుంటూ బోంబే వెళ్ళాను ట్రెయినింగులో చేరటానికి. ట్రెయినింగులో చేరింతరువాత తెలిసింది, ట్రెయినింగు సంవత్సరమంతా ప్రతీ సోమవారమూ పరీక్షలుంటాయనీ, ఈ పరీక్షల్లో వచ్చే మార్కులతోనే మనకి తరువాత ఇచ్చే పోస్టింగు నిర్ణయిస్తారనీ! ఇక చెసేదేముంది. దేవుణ్ణి నానా తిట్లూ తిట్టుకోని పుస్తకాల మీద పడటం తప్ప?

శారద

vivek said...

hahaha.....meeru rasina anni posts kante idhe interesting ga,..chala senstive ga anipinchindi naaku...super rasindru...

manalo mana maata,..me paper la,..antha pedda word 'assignment' spellin crct rasi,..antha chinna 'maths' spellin tappu rasarenti??...n me teacher 'sunna' lu matram bale pettindi....gundranga,..andangaa.. :)

శివరంజని said...

ఇక మీ ఎనిమిదవ తరగతి ఎగ్జామ్ పేపర్ లో మార్కులు అరుపులు.. హహహ. .మీ హ్యాండ్ రైటింగ్... అబ్బబ్బ్బా... అధ్బుతం.. పాపం మీ సార్. ఎలా కరెక్ట్ చేశారో ఏమిటో ;) ;)>>>>>>>>.రాజ్ కుమార్ గారి డవిలాగే నాదీను .........

నువ్వు సూపర్ సౌమ్యా ఎనిమిదవ తరగతి పేపర్ ఇంకా దాచావా ??????/ అదీ సున్నా మార్కులు వచ్చిన పేపర్............ నువ్వు గ్రేట్ సుమీ .....లెక్కలంటే నాకు భయమే కాని లెక్కల్లో పాస్ మార్కులు దాటి కొంచెం అంటే 50లలో మాత్రమె వచ్చేవి


కాని నాకు చిన్నప్పుడు ఎగ్జామ్స్ అంటే భలే ఇష్టం ఉండేది ..మిగతా రోజుల్లో పట్టించుకోని వారందరూ ఆఎగ్జామ్స్ లో ఎంత అభిమానం గా చూసేవారో ..... అలా పోగుడుతున్నందుకు అయినా పరిక్షలు రావలనిపించేది

Unknown said...

మీ పరిక్షల కస్టాలు చూసి నవ్వలేక నవ్వలేక ఎలాగో అల మొత్తం చదివి మళ్ళి నవ్వి ...
హమ్మయ్య....గండం గడిచింది అనుకుంటూ పరుగెత్తుకుంటూ, పడుతూ లేస్తూ, దొర్లుతూ, పిల్లిమొగ్గలేస్తూ క్లాసురూమ్‌కి చేరిపోయాను. కెవ్వు కేక ఇది
దేవుడా...నా ప్రతిభ దశదిశాలా వ్యాపించిందా....జిల్లాలు దాటి పాకిందా అనుకుంటూ మనసులో ఏడ్చుకున్నా
ఇది ఇంకా సూపర్
పరీక్షా పత్రాన్ని హెడింగ్ తో సహా క్షుణ్ణంగాచదువు, తరువాత రాయి
నో కామెంట్ ఓన్లీ చప్పట్లు

ఆ.సౌమ్య said...

@కొత్తవకాయ
హహహ నీకు గుర్తొచ్చారా మన స్కూలు టీచర్లందరూ....ఎంత భయపడేవాళ్ళమో కదా ఆ సోషల్ టీచర్ ని చూసి!
హిహిహి నాకొచ్చిన ఒకే ఒక సున్న కదా ఇది, అందుకే భద్రంగా దాచుకున్నా.
మా ఇంట్లో నేలమాళిగలు తవ్వితే ఇది కనిపించిందిలే. :P ఇంకా బోలెడున్నాయి ఖజానాలో...ఒక్కోటీ బయటపెడతా.
ధన్యవాదములు!

@వేణూరాం
హహ నీకు అలాగే అయిందా, పొనీలే ముందే చూసుకున్నావుగా...గండం లేదు.
హిహిహి నా హేండ్ రైటింగ్ చూసి మూర్చపోయావా...కోడికెలుకుడు
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ నైమిష్
హహహ చూసారా నాకు లెక్కలు ఎంత బాగా వచ్చో!
చిన్నప్పుడు చిత్తు అలా ఓ పక్కనా రాసుకునేవాళ్ళం కదా, గీత కూడా కొట్టేవాళ్ళం :)
ఈరోజులు ఎప్పుడూ అందరూ మధుర స్మృతులే కదా!
ధన్యవాదములు.

@గిర్రిష్
ధన్యవాదములు. నా టపా చూసి మీరంతా మీ చిన్ననాటిరోజులకి వెళ్ళిపోయినందుకు సంతోషంగా ఉంది. :)

బులుసు సుబ్రహ్మణ్యం said...

@శంకర్ గారు
>>>మీ పేరులో "U" పోయి "W" ఎప్పటినించీ వచ్చింది?

బహుశా you వదిలి we కి వచ్చినప్పుడు అనుకుంటాను. అంతేనండి శంకర్ గారూ సున్నా మార్కులు వచ్చిన వాళ్ళు కూడా లెఖ్ఖలు చెప్పేస్తుంటే ఏమంటాము. విధి విపరీతం, విధి విడ్డూరం, విధి విలాసము అన నిదియే కదా. దు.హా

సౌమ్య గారూ..
ఒక మాటు హై స్కూల్ లో కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ మాష్టారు 3 నెలల పరీక్ష పేపర్లు దిద్దారు. అందరికీ మార్కులు చెప్పి పేపర్లు ఇచ్చేశారు నాకు తప్ప. "నాయనా సుబ్రహ్మణ్యం నువ్వు రాసింది, చదివి చెపితే నేను మార్కులు వేస్తాను" అన్నారు. నా రైటింగ్ అంతా గొప్పగా ఉండేది. ఇప్పుడూ అల్లాగే ఉంది. అ.హా
పరీక్షల గురించి మేము పెద్దగా వర్రీ కాలేదు ఎప్పుడూ. ఎంత కాలం ఒకే క్లాసు లో అట్టే పెడతారు, విసుగొచ్చి వాళ్ళే పాస్ చేస్తారు అనే ధీమా. అయినా మా కాలం లో ఇన్ని పరీక్షలు లేవండి. ఇంకో అ.హా.

ఏది ఏమైనా అంత సాహసోపేతం గా ఆ పరీక్షల గండాలు దాటినందుకు మీకు అభినందనలు.

మాలా కుమార్ said...

మీ పరీక్షల ప్రహసనం బాగుంది సౌమ్య :)

ఆ.సౌమ్య said...

@ కొత్తపాళీ గారూ
ధన్యవాదములు!
"ఇంటర్నల్స్ - ఎక్స్‌టర్నల్స్ - ఏ కాలేజి ఏ బేచి చూసినా ఇదే చరిత్ర! విద్యార్ధుల చరిత్ర మొత్తం పరీక్షలకి బానిసత్వం"....హహహ బాగా చెప్పారు....అంతే అంతే!
బాబోయ్ ఓపెన్ బుక్ ఎగ్సాం గురించి చెప్పకండి...ఓసారి అనుభవం అయింది....అదో పీడ కల :)

పి.హెచ్.డీ కి వచ్చాక నేనూ మీలాగే ఒట్టేసేసుకున్నా...ఇప్పటివరకూ ఒట్టు తీసి గట్టి మీద పెట్టలేదు!

@లత గారూ
ధన్యవాదములు! ప్రతీ విధ్యార్థికీ అలాగే ఉంటుందికాబోలు! :)

ఆ.సౌమ్య said...

@ శంకర్ గారూ
చిట్టి సౌమ్య ఎవరా...హెంత మాట హెంత మాట!...నేనే..ఇంకెవరు ;)
ఏ పేపరుకి జవాబులు రాస్తున్నామని కాదన్నయా...జవాబు రాసామా లేదా న్నది ముఖ్యం....మీ పప్పులేమీ ఉడకవోచ్!

నా పేరు లో చిన్నప్పుడంతా "U" ఉండేదండీ... కాస్త నాకు లోక జ్ఞానం పెరిగాక బెంగాలీ/ఒరియా పేరులా ఉంది...మన సౌత్ ఇండియన్ గా తెలియాలంటే "W" కి మారిపోవాలని W లోకి దూకేసానన్నమాట. ఆ తరువాత నాకు "W" ఎందుకో బాగా నచ్చేసింది, ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను.
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ సుజాత గారూ
అబ్బే ఉత్తుత్తినే, అది చిన్నప్పుడు...ఇప్పుడు నేను సూపరు....మీ పిల్లదానికి నా గురించి మంచిగా అలాగే చెబుతూ ఉండండి.:)
సంకీర్తన నవ్వుతోందా నా పేపర్ చూసి :D

ఆ మీ పరీక్షలు ఇంకా బోలెడు దూరంలో ఉన్నాయి, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు...నా మాట విని హాయిగా ముసుగుతన్ని పడుకోండి...కావాలంటే పరీక్ష ముందురోజు నైట్ అవుట్ చెయ్యొచ్చు.
ధన్యవాదములు!

@సృజన
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ మురళీ గారూ
ధన్యవాదములు!
హహహ అయితే మీకు చిన్నప్పుడు బాగా దెబ్బలు పడ్డాయా!
మీరూ గతంలోకి వెళ్ళిపోయారా...మీరంతా ఇలా మీ మీ జ్ఞాపకాలు తుట్టు కదుపుతూ ఉంటే నాకూ ఆనందంగా ఉంది.

@ మధుర వాణి
మరే...ఒకటా, రెండా!
ఇప్పుడు బాగా నవ్వొస్తున్నాదిగానీ ఆ రోజుల్లో నేనెక్కడికి వెళ్ళినా ఇదే హాట్ టాపిక్....చచ్చేదాన్ననుకో!
ధన్యవాదములు!

తృష్ణ said...

అమ్మో నేనెంత లేటో...
ఏంతైనా మీరూ ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్ అంతటివారని చెప్పకనే చెప్పేసారు.:)))
చాలా బావుందండి పోస్ట్.

వేణూశ్రీకాంత్ said...

ఆహా మీ ‘MATCHS TALLANT’ అదిరింది సౌమ్యా... ఆ పేపర్ ఇన్నాళ్ళు భద్రంగా దాచినందుకు మీకు పాతిక మార్కులు వేసేయచ్చు :-) మిగతా రెండు పరీక్షలు కూడా చించేశారు అంతే :-) అసలా వేరే పేపర్ రాక రాక మీకే రావాలా :-)

buddhamurali said...

ఆ సౌమ్య గారు మనం అనుకుంటాం గాని సున్నా మార్కులు తెచ్చుకోవడం చాలా కష్టమండి. కావాలంటే మీరు చాలెంజ్ చేయండి. మొత్తం బ్లాగ్ ప్రపంచం లో సున్నా మార్కులు వచ్చిన వారు ఉంటే రమ్మని సవాల్ చేయండి. ఐనా ఆ మాస్టర్ ఎవరండి అంత రాసినా సున్నా మార్కులు వేయడం ఏమిటి. వివరాలు సంపాదించండి . కాస్త జాగ్రతగా ఉందండీ ఇంకా నయం అంత కష్టపడి రాసినా మీ అనుభవాలు వేరే వాళ్ళ బ్లాగ్లో పోస్ట్ చేయలేదు ( వేరే పరీక్ష రాసినట్టు )

రహ్మానుద్దీన్ షేక్ said...

మీరు ఉత్తమ స్త్రీ అన్నది భలే సెట్ అయింది మొన్నటి టాపిక్ కి టైమింగ్ అదిరింది

ఆ.సౌమ్య said...

@ శారద గారూ మీరూ సెంట్రల్ యూనివర్సిటీ యేనా...ఆయ్...బలే బలే. నేను కూడా. మీ ఫిజిక్స్ కి ఏమీ తక్కువ లేకుండా ఉండేదండీ మా ఎకనామిక్స్ కూడా. ఎప్పుడూ పరీక్షలు పరీక్షలు పరీక్షలు...ఇంకా టెర్మ్ పేపర్లు, ప్రజెంటేషన్లు, మన్నూ, మశానం...విరక్తి వచ్చేసింది ఆ దెబ్బతో.

పాపం, మీ పని పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయిందన్నమాట :D
ధన్యవాదములు!

@శ్రీకాంత్
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ వివేక్
నచ్చిందా...ధన్యవదములు!
హహహ నా ఇంగ్లీషు స్పెల్లింగుల గురించి అడక్కు...ఎప్పుడు ఏది కరక్టుగా రాస్తానో నాకే తెలీదు.
మా మేషారు రైటింగ్ చాలా బావుండేదిలే...సున్న లు కూడా గుండ్రంగా పెట్టేవారు!

@శివరంజని
ధన్యవాదములు!
నా రైటింగ్ చూసి అదిరిపడ్డావా! :D
హహహ ఇలాంటి పాత బంగారాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటి స్పెషల్ ఐటెమ్స్ నేను భద్రంగా దాస్తుంటా.

ఎగ్జామ్స్ అంటే ఇష్టమా....నా తల్లే! :)

ఆ.సౌమ్య said...

@ శైలు గారూ
ధన్యవాదములు!
హహహ మిమ్మల్ని బాగా నవ్వించిందా నా పోస్ట్!
ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నాకూ బలే నవ్వొస్తున్నాది.

@ మాలా కుమార్ గారు
ధన్యవాదములు!

ఇందు said...

నిజం చెప్పాలంటే..మీ ఆన్సర్ పేపర్ చూసి ఎంతసేపు నవ్వుకున్నానో...9X9=18 ఆ!?!?! హ్హహ్హహ్హా!

అమ్మో అలా కోపంగా చూడకండీ...మాడిమసైపోగలను!! ;)

కాని వాటిని ఎంచక్కా ఫొటోలు తీసి మరీ బ్లాగులో పెట్టిన మీరు చాలా గ్రేట్! :)

పాపం చిట్టి సౌమ్యకి ఎన్ని కష్టాలో ;) :P

స్నిగ్ధ said...

అబ్బా సౌమ్య గారు,ఏం రాసారండీ..కేకో కేక...
8థ్ క్లాస్ లో ఉన్నప్పుడు జరిగింది సూపర్..అంతే అండీ..కొంత మంది అలానే ఉంటారు టీచర్లు..మొత్తానికి ఆవిడ ఒప్పుకుంది కదా..:p
జిల్లాలు దాటిన మీ కీర్తి..:)
హెడ్డింగ్స్ చూసి రాయమనడం..
సున్నా మార్కులు వచ్చిన పేపర్ ఇప్పటికీ దాచుకున్నారంటే మీరు చాలా గ్రేట్ సుమీ.. మొత్తం మీద "matchs tallant" అదిరింది

జయ said...

బాగుంది సౌమ్యా, ఎం.ఏ. వరకు మీ చదువు సాగిన విధానం. నాకు మీ పి.హెచ్.డి. ఎక్ష్పీరియన్స్ కూడా తెలుసు కోవాలని ఉంది. మీకు తెలుసా, నాకో సారి తెలుగు పేపర్ లో జీరో వచ్చింది. ఆ పేపర్ మొత్తం గ్రామరే. బాగుంది కదూ నా రికార్డ్:)

ఆ.సౌమ్య said...

@బులుసుగారూ
"U వదిలి W కి వచ్చినప్పుడు"......హహహ, మీరు భలే చెబుతారండీ...చమత్కారులు సుమీ!
మీరు చెప్పినట్టు కాదుగానీ ఎందుకొచ్చిందో శంకర్ గారికిచ్చిన జవాబులో రాసేసాను...ఓసారి చదివేసుకోండి.

హహహ మీలాంటి అనుభవమే నాకూ చాలాసార్లు అయ్యింది. మా క్లాసు టీచర్లూ అనేవారు నా రాత నాకు తప్ప ఇంకెవరికీ అర్థం కాదని...కోడి కెలుకుడు రాత అనేవారు.
ధన్యవాదములు!

@తృష్ణ గారూ
హహ లేట్ ఏమీ కాదులెండి...చదివారు కదా, అదే సంతోషం... నేను ఝాన్సీరాణినా....హహహ ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@ వేణు
పాతిక మార్కులే...నాకే!...Thank you Thank you! ఇవన్నీ తీపి గుర్తులండీ...అందుకే జాగ్రత్తగా దాచుకున్నాను. :)
అదే కదా...నా సంగతి తెలిసీ ఆ తొక్కలో పేపర్ నాకే రానేల...నా పరువు తీయనేల...హతవిధీ! ధన్యవాదములు!

@రహ్మాన్
హహ కదా...ఆరోజు ఈ పోస్ట్ రాస్తుంటే ఆ టాపిక్కు వచ్చింది. అది ఇలా ఉపయోగించేసుకున్నానన్నమాట.
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@బుద్దా మురళి గారూ
కదా...సున్న మార్కులు తెచ్చుకోవడం ఎంత కష్టమో...ఆ కష్టం నాకే తెలుసు
ఎంత కష్టపడి మూడు పేజీలు నింపినా సున్నా వేసారు చూడండి...అదెంత కష్టం! :)
"ఇంకా నయం అంత కష్టపడి రాసినా మీ అనుభవాలు వేరే వాళ్ళ బ్లాగ్లో పోస్ట్ చేయలేదు ( వేరే పరీక్ష రాసినట్టు )".....హహహ ఇది చదివి ఎంత నవ్వుకున్నానో! మీ మార్కు వ్యంగ్యం పోనిచ్చుకున్నారు కాదు! :D
ధన్యవాదములు!

@ఇందు
కెవ్వ్...నేను గమనించలేదు సుమీ, నువ్వు చెప్పాకే చూసాను..."9X9=18"....హహహ.
అంటే అన్ని లెక్కలు ఒక్కసారి కళ్లముందు కనబడేసరికి గాబరాలోగుణింతాలు కూడా మరచిపోయానన్నమట!
ధన్యవాదములు!

ఆ.సౌమ్య said...

@స్నిగ్ధ
హహహ thank you, thank you.
ఏమిటో నా కీర్తి అలా అలా విస్తరించేస్తున్నాది...ఏం చెయ్యను!

@జయ గారూ
హహహ తెలుగులో సున్న వచ్చిందా...అయితే మీరు నేను ఒకే జట్టు!
పి.హెచ్.డీ గురించి ఒక పోస్ట్ రాసాను. ఇక్కడ చూడండి.
http://vivaha-bhojanambu.blogspot.com/2010/08/blog-post.html
ధన్యవాదములు!

Unknown said...

సౌమ్యా.. భలే రాసారు. ఏం మెజిక్ చేసారో? ఎలా చేసారో కాస్త చెపుదురూ.. మీకు పుణ్యం ఉంటుంది..

Anonymous said...

సౌమ్యా ..నాక్కూడా లెక్కలన్నా లెక్కలని ఇష్టపడేవాళ్ళన్నా ఖో..పం వచ్చేస్తుంది . అస్సలు లెక్కలు వుండవుకదా అని వందమందిని అడిగి మరీ బి.ఎ లో చేరిపోయాను .

ఆ.సౌమ్య said...

@ ప్రసీద
Thanks a lot!
హహ మేజిక్‌లన్నీ అలా బయటికి చెప్పకూడదండీ...రహస్యం! :P

@ లలిత గారూ
హహహ మీరూ నా పార్టీయేనన్నమాట. కాకపొతే కాస్త పెద్దయ్యాక లెక్కలంటే భయం పోయిందిలెండి నాకు.
ధన్యవాదములు!

నందు said...

సౌమ్య గారు భావున్నాయి మీ లెక్కల జిమ్మిక్కులు......

ఆ.సౌమ్య said...

@ నందు గారూ
:)) thank you!

రామ said...

ఇన్నాళ్ళూ వివిధ బ్లాగుల్లో మీ కామెంట్లు చూడడమే తప్ప మీ బ్లాగు చదవలేదు. మొదటి పోస్ట్ ఇదే చదివా.. చాలా బాగా రాసారండి. ఇక పై మరి ఫాలో అయిపోతా. :)

ఆ.సౌమ్య said...

@ రామ గారు
చాలా Thanks! మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది! తరచూ చూస్తారని ఆశిస్తున్నా :D