ఢిల్లీలో ఏ గల్లీలో చూసినా పోలీసులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు. ఇదేదో బలే బావుందే...చక్కగా మనకి ఎంత రక్షణ అని మురిసిపోయేలోపే వాళ్ళ ప్రతాపాలు తెలిసి ప్రాణం బిక్కుబిక్కుమంటుంది. ఒక పెద్ద రోడ్డు మీద సాయంకాలం అయిన దగ్గరనుండీ రెండు వైపులా పెద్ద పెద్ద గేటుల్లాంటివి పెట్టేసి మధ్యలో కాస్త దారి మాత్రమే వదులుతారు. కార్లన్నీ ఒకదాని వెనుక క్యూలో వెళ్లాలన్నమాట. ఇది ఎందుకయ్యా అంటే...అది రద్దీ రహదారి కాబట్టి కాస్త చీకటి పడగానే తాగేసి ఎవరైనా డ్రవ్ చేస్తూ అటుగా వచ్చి మిగతా వాహనాలకు ఇబ్బంది కలిగిస్తారేమొనని. తాగి డ్రైవ్ చేసినట్టు పట్టుబడితే శిక్ష చిన్నది కాదు. అందుచేత అందరూ ఒళ్ళు దగ్గరపెట్టుకుని రండి అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అక్కడ జరిగే అసలు విషయమేమిటంటే ఆ మధ్యమార్గం గుండా కార్లన్ని వరుసపెట్టి వదిలేస్తుంటారు. కానీ అటుగా వచ్చే ప్రతి ఒక్క ద్విచక్ర వాహనాన్ని ఆపేసి పక్కన నిల్చోబెడతారు. వరుసగా అందరి దగ్గరా లైసెన్సు, RC చూసి ఓ వంద నొక్కేస్తుంటారు. విధిగా ప్రతీ బైక్ ని ఆపుతారు. నేను రోజూ ఆ రోడ్డు గుండా వెళుతుంటాను. సాయంత్రం ఇంటికెళ్ళేటప్పుడు రోజూ కనీసం ఐదు బైకులు పక్కన నిలబడి ఉండడం చూస్తాను. ఒకరోజు, ఒక సమయానికి ఐదు బైకులు అంటే ఐదువందల రూపాయలు. ఈ లెక్కన లెక్కేస్తే వాళ్ళ రోజు సంపాదన, నెల సంపాదన లెక్కించడానికి ఏ శ్రీనివాస రామానుజమో దిగి రావాలి. లైసెన్సు, RC చూపించాక కూడా వంద ఎందుకు అని అడిగావో మరుక్షణం నువ్వు జైలో ఊచలు లెక్కెడుతుంటావు. అలా అడిగిన పాపానికి ఒకతన్ని రెక్కీడ్చుకుపోయి బొక్కలో తోసిన సన్నివేశం ఒకటి చూసాను.
న్యూ డిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర, ఓరోజు మా కార్ లో వెళ్తున్నాం. మేము ఎడమవైపుకి తిరగాలి. తెలీకుండా ముందుకి లాగించేసాం. అరె సందు మిస్ అయిపోయామే ఇప్పుడెలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ, మెల్లిగా నడుపుతుండగా పోలీసు తలుపు కొట్టాడు. ఏమిటయ్యా అని అడిగితే ఇది one way అన్నాడు. అదేమిటి ఎదురుగుండా లారీలు వెళుతున్నాయిగా అని అడిగితే పెద్ద వాహనాలకి తప్ప చిన్న వాహనాలకి దారి లేదన్నాడు. ఇదేం విచిత్రం అనుకుంటుండగా లైసెన్సు, RC అడిగాడు. తీసి చూపించాము. మాకు అది one way అని తెలీదు. ఎక్కడా బోర్డు రాసి లేదు. ముందు వాహనాలు వెళుతుంటే two way అనుకున్నాం అని చెప్పాము. ఐదొందలు ఇవ్వు అంటూ మా లైసెన్సు, RC ని చేతుల్లో ఆడించాడు. ఐదొందలంటే మరీ ఎక్కువని బ్రతిమలాడడం మొదలెట్టాం. ఓ ఐదు నిముషాలు పోయాక వందకి ఒప్పుకున్నాడు. వంద వాడి మొహాన కొట్టి బ్రతుకు జీవుడా అనుకున్నాం. మరునాడు అదే రూటులో వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చూస్తే అక్కడ one way లేదు, కాదు. పక్కనున్నవాళ్ళని అడిగాము. అక్కడ one way ఎప్పుడూ లేదు అని చెప్పారు. అప్పుడప్పుడూ పోలీసులు ఉంటారు తప్ప one way లేదు అన్నారు. మాకు విషయం బోధపడింది. మా లైసెన్సు, RC వాడి చేతుల్లో ఉన్నాయి..ఏం చేస్తాం వంద కాదు, వెయ్యి అడిగినా ఇచ్చుండేవాళ్లమే!
లైసెన్సు అంటే గుర్తొచ్చింది...ఆ మధ్య మేము కొత్త two wheeler కొన్నాం. లైసెన్సు కోసమని RTO ఆఫీసుకి వెళ్ళాం. అక్కడ ఏదీ సక్రమంగా లేదు. ఏ కౌంటర్ నుండి ఏ కౌంటర్ కి వెళ్ళాలో చెప్పే నాధుడే లేడు. సరే ముందు అప్ప్లికేషన్ తీసుకుందామని వెళితే ఐడి ప్రూఫ్ చూపించమన్నాడు. పాస్ పోర్ట్ తీసి చూపించా. కుదరదన్నాడు. ఏమి? అన్నాను. ఇందులో హైదరాబాదు అడ్రస్ ఏదో ఉంది డిల్లీ అడ్రస్ కావలన్నాడు. అయ్యా నేను ఈ భారతదేశ పౌరురాలిని అని తెలియజెప్పే ఏకైన మౌలిక పత్రం ఇది అన్నాను. నాకనవసరం అన్నాడు. పాస్ పోర్ట్ చెల్లదా అంటే చెల్లదు అని తెగేసి చెప్పాడు. నోరు వెళ్లబెట్టి ఆశ్చర్యపోవడం మావంతయింది. ఇక్కడే కాదు ఢిల్లీలో ఏ గవర్నమెంటు ఆఫీసులోనూ పాస్ పోర్ట్ చెల్లదని తరువాత అర్థమయింది. ఆహ ఏమి నా దేశ సౌభాగ్యము...ఈ దేశ పౌరునిగా ముద్ర వేసిన ప్రభుత్వానికే ఇది చెల్లదు అని తేల్చిచెప్పుచున్నారు!
సరే ఇంకేం చేస్తాం లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఒకటిచ్చి అప్లికేషన్ తెచ్చుకున్నాం. నింపి ఒక కౌంటర్ లో ఇచ్చాం. "ఇక్కడ కాదు" అని గసిరింది ఆవిడ. మరెక్కడ అంటే జవాబులేదు. కన్నెత్తి చూడనైనాలేదు. అక్కడెక్కడా help counter లేదు. ఏమి గతి అనుకుంటూ మరో మహానుభావుడిని పలకరించాం. గురుడు కొంచం సాధుజీవిలా ఉన్నాడు...గసరడానికి ఓ పిసరు తక్కువగా "ఆ కౌంటకి వెళ్ళండి" అని సమాధానమిచ్చాడు. అదే పరమాన్నం అనుకుని ఆ కౌంటర్ లో ఇచ్చాము. అతగాడు అఫిడవిట్ కావలన్నాడు. నాయనా, ఇదియునూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పత్రమే, ఇందులో నా అడ్డ్రస్ ప్రూఫ్ కూడా సరిగానున్నది, అఫిడవిట్ ఎందులకు అని అతి మృదువుగా అడిగితిని. "ఎందులకూ లేదు గిందులకూ లేదు ఆ పక్క సందులోకి పోయి అఫిడవిట్ పట్రా" అని ఓండ్ర పెట్టాడు. పక్కసందులోకి పోయి చూచితిమిగదా....ఒక మనుజుడు, నల్ల కోటు ధరియించి, రహదారి పక్కన ఒక బల్లయును, కుర్చీయును వేసుకుని తారసిల్లినాడు. మేము అచ్చటకిబోయి ఓ మనుజుడా మాకు అఫిడవిట్ ప్రసాదింపుము అని శాంతముగా అడిగితిమి. 50 కొట్టు అన్నాడు. ఏమి ఏమేమి, ఒక చిన్న సంకతమునకు 50 రూప్యములా...హెంతమాట హెంటామాట అని అన్నగారి స్టైల్ లో మునివేళ్ళపై లేచి రెట్టించుదామనుకున్నాను గానీ ఆ మానవుడు ఎర్రగా చూసి "అవును, 50 ఇవ్వు" అని గద్దించాడు. మేము ఈ చేతను 50 ఇచ్చి, ఆ చేతను అఫిడవిట్ పుచ్చుకుని మరల RTO కి ఏతెంచితిమి. మాలాంటి సజ్జనులు, అమాయకులు ఒకరోజుకి ఎంతమంచి ఏతెంచెదరో! ప్రతీ ఒక్కని దగ్గర 50 రూప్యములు నొక్కిన అతని ఆదాయము నెలకి ఎంత వచ్చునో లెక్కింప మానవమాత్రునికి సాధ్యం కాదు.
పిమ్మట ఆ form ని సమర్పించుకుని కౌంటర్ తరువాత కౌంటర్ కి వెళుతూ ఉన్నాం. నాలుగో కౌంటర్ లో ఒకమ్మాయి, వయసు 25 కి మించదు...ఎంతసేపు నిల్చున్నా పలకదు, ఉలకదు. పలకరిస్తే కన్నెత్తి చూసిందే తప్ప పెదవి విప్పదు. ఏం చెయ్యాలో తెలియక కొంచం స్వరం పెంచాను. బాణంలా దూసుకొచ్చింది జవాబు "ఏం కాసేపు ఆగలేరా? ప్రతీఒక్కరికీ జవాబు ఇవ్వడమేనా మా పని? మీ అర్జీ చూసాక బదులిస్తాను" అంది. నాకు ఒళ్ళు మండిపోయింది...మేము పశువులమనుకుంటున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని స్వరం పెంచాను. నా అర్జీని నా చేతిలో పెట్టి "నీ దిక్కున్నచోట చెప్పుకో నీ అప్ప్లికేషన్ ముందుకి వెళ్ళనివ్వను" అంది. నేను ఇంకాస్త గట్టిగా అరిచాను. చిన్న సైజు రామ-రావణ యుద్ధమే జరిగింది. ఇంత జరుగుతున్నా మిగతా సభ్యులు నోరుమెదపరే! కొందరు ఆసక్తిగా వింటున్నారు, ఇంకొందరు రోజూ ఉండే గొడవేగా అన్నట్టు తమపని తాము చేసుకుపోతున్నారు. అరిచి అరిచి నాకే విసుగొచ్చి పక్క కౌంటర్ కి వెళ్ళాను. అతనికి నాపై జాలేసినట్టుంది...కరుణించి నా అర్జీని ముందుకి తీసుకెళ్ళాడు పెద్దగా చిరాకుపడకుండా. ఈ అగచాట్లు అన్నీ పడ్డాక టెస్ట్ రూములోకి వెళ్ళాను. అక్కడున్న పెద్దమనిషి కుక్కని చూసినట్టు చూసి "అక్కడ కూర్చో, ఆ టెస్ట్ రాయి" అని విసుక్కున్నాడు. అదేదో తగలెట్టి, అతని దగ్గరకెళ్ళి నా పేరులో చిన్న మార్పుని సూచించాను. అంతే అతను కయ్యిమని అరిచాడు "మేమేం పనిపాట లేకుండా ఉన్నామనుకున్నారా మీ ఇష్టమొచ్చినట్టు మార్చడానికి" అంటూ చిందులు తొక్కాడు. నేను అప్లికేషన్లో సరిగ్గానే రాసాను కానీ వాళ్ళు తప్పు టైపు చేసారు అని చెప్పినా వినిపించుకోడే! నిజంగా పురుగుని చూసినట్టే చూసాడు. అప్పటికే నాకు తలనొప్పి వచ్చేసింది. అసహ్యం, విసుగు, కోపం...ఒకటేమిటి చీ ఈ లైసెన్సు నాకవసరమా, ఎంతదూరమైనా నడిచి వెళ్ళిపోతే ఇంతకన్నా హాయి కదా అనిపించింది. చివరి ప్రశ్నగా ఎన్నాళ్లలో learner లైసెన్సు పంపిస్తారు అని అడిగాను. "ఏమో, ఎప్పుడొస్తే అప్పుడొస్తుంది, మాకేం తెలుసు..మీ ఇంటికొస్తుంది అప్పుడు చూసుకోండి" అని సమాధానం. ఇంక అక్కడ ఒక్క క్షణం ఉన్నా మహా పాపం చుట్టుకుంటుంది అన్నట్టు వడివడిగా బయటికొచ్చేసాము. తెలిసినవాళ్ళకి ఈ ఉదంతం చెబితే ఇక్కడ అలాగే ఉంటారు, అలాగే మాట్లాడతారు...అసలు మీకెందుకీ బాధ, మిమ్మలని ఎవరెళ్ళమన్నారు, ఏజెంట్ కి ఇచ్చేస్తే వాడే అన్నీ చేసి పెడతాడు. ఓ 2000 వాడి మొహాన కొట్టండి అన్నారు. అప్పటికే పాలిపోయి ఉన్న మా మొహాలు మరింత తెల్లబోయాయి.....ఇదేమి విచిత్రం! మానవమాత్రులు RTO కి వెళ్ళి లైసెన్సు సులువుగా తెచ్చుకోలేరా! సరే, ఎలాగోల లెర్నర్ వచ్చింది. ఆరు నెలలు గడిచాక లైసెన్సు తెప్పించుకుందామనేలోపు కారు కొన్నాం. మళ్ళీ RTO ఆఫీసు గుర్తొచ్చి ఏడుపొచ్చింది. ఏమిదారి అనుకుంటుండగా ఏజెంట్ విషయం గుర్తొచ్చింది. ఒక driving school కి వెళ్ళి మాట్లాడాము. 15 రోజులు డ్రైవింగ్ క్లాసులు, లైసెన్సు పని కలిపి 4000 అన్నాడు. మూర్ఛ రాబోతుండగా ఆపుకుని సరే అన్నాము.
ఈసారి RTO ఆఫీసు లో బలే తమాషా జరిగింది. మా ఏజెంట్ వెనకల వెళ్లాం. అప్లికేషన్ నింపి ఇచ్చేసాం. అంతే, కాసేపు కూర్చోమన్నాడు. బుద్ధిగా కూర్చున్నాం. ఓ 15 నిముషాలలో వచ్చి అన్నీ అయిపోయాయి అని చెప్పి టెస్ట్ రూముకి పంపించాడు. అక్కడున్న అసిస్టంట్ తో ఏదో చెప్పాడు. నేను కంప్యూటర్ ముందు కూర్చున్నాను. mouse నా చేతిలో లేదు. మొదటి ప్రశ్న వచ్చింది. "జవాబేమిటి?" అన్నాడు. చెప్పాను...అది తప్పయింది. ఇంక అంతే రెండో జవాబు నుండి నేను నిమిత్తమాతృరాలినే....అతగాడే టకటకమని జవాబులు నింపేస్తూ ముందుకి పోతున్నాడు. మధ్యలో కావాలనే కొన్ని తప్పు జవాబులిచ్చాడు. అన్నీ కరక్ట్ అయితే అసలు నిజం తెలిసిపోతుందనో ఏమో! మొత్తానికి 20 కి 16 మార్కులు వచ్చాయి నాకు....కాదు కాదు అతనికి. బయటికొచ్చేసాము. "మీరు వెళ్ళిపోండి మేడం రెండు రోజుల తరువాత లెర్నర్ ఇంటికి పంపిస్తాను" అన్నాడు. ఆహా ఏమిటీ...20 నిముషాలలో అంత అయిపోయిందా!...కేకలు, అరుపులు, తగవులు, చికాకులు లేకుండా! నిజమే! నమ్మబుద్ధి కాలేదు. అబ్బ 4000 లకి ఎంత శక్తి! ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాము. రెండు రోజుల్లో లెర్నర్ వచ్చింది.
నెలరోజులలో నేను కారు ఓ మోస్తరుగా నడిపి నేర్చుకునాను. ఇప్పుడు లైసెన్సుకి వెళితే ఎనిమిది వెయ్యమంటారో ఏడున్నర వెయ్యమంటారో ఏం దారి దేవుడో అని బిక్కుబిక్కుమంటూ మా ఏజెంట్ వెనకాల వెళ్ళి మళ్ళీ RTO గుమ్మం తొక్కాము....ఈసారి ఇంకా మజా వచ్చింది. మరో form నింపమన్నాడు. నింపేసి ఇచ్చాము. 10 నిముషములు కూర్చోబెట్టాడు. తరువాత మా ఏజెంట్ మరొకతనితో కలిసి మా దగ్గరకి వచ్చి నన్ను చూపించి "ఈమెకే లైసెన్సు కావాలి, జాగ్రత్తగా మనిషిని చూడు" అని చెప్పేసి దూరంగా కౌంటర్ లో ఉన్న వ్యక్తికి నా పేరు గట్టిగా అరిచి చెప్పి "చూసుకో" అన్నాడు. అంతే, "మీరింక వెళ్ళిపోండి మేడం. ఒక వారం రోజులలోగా లైసెన్సు ఇంటికి తెచ్చి ఇస్తాను" అన్నాడు. నేను విస్తుపోతూ "అయిపోయిందా, మరి డ్రైవింగ్ టెస్టో అన్నాను" మా ఏజెంట్ నన్నో పల్లెటూరిదానిలాగ చూసి, ఓ చిన్ననవ్వు నవ్వి "అవన్నీ అక్కర్లేదులెండి" అన్నాడు. వాహ్ వాహ్...బలే బలే, నాకు కారు నడపడం వచ్చో రాదో చూడకుండా నా చేతిలోకి లైసెన్సు వస్తుంది. ఆహా మన ప్రభుత్వము ఎంత బాగా నడుస్తున్నదో కదా అని మిక్కిలి సంతసించితిమి. ఈ వ్యాపారం చిన్నదేం కాదు. ప్రతీ సందుకీ ఓ డ్రైవింగ్ స్కూలు ఉంది. ప్రతీవాళ్ళు ఈ ఏజెంట్ల ద్వారానే లైసెన్సు తెచ్చుకుంటారు.
అదేరోజు, సరిగ్గా అదే సమయానికి అటుపక్కగా "అన్నహాజారే కి సపోర్ట్ ఇవ్వాలి" అంటూ జెండాలు పట్టుకుని ర్యాలీ వెళుతున్నాది. "ఈ అన్నాహజారే ఏంది భయ్, ఈ అవినీతి ఏంది భయ్, ఏం సమజౌతలే" అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మా చెవులబడింది. అవును, అసలింతకీ అవినీతి అంటే ఏమిటి?
తా.క: అభివృద్ధి చెందుతున్న ఏ దేశానికైనా ఈ అవినీతి తప్పదు. అది దాని లక్షణం. అమెరికాకి తప్పలేదు, జర్మనీకి తప్పలేదు...మనకీ తప్పదు.
37 comments:
సొమ్య...కెక....ఇక నా అనుభవం రాయక్కర్లెదు...
నీకు నీకు పదహారు మార్కులె వచ్చాయి...సెమ్ పించ్....
ఇందు గలడు..అందు లెడని సందెహంబు వలదు...
నా కళ్ళు తెరిపించావు.....
అవును. ఒక పశువు ని చూసినట్లు చూస్తారు RTO office లో. మనకి వాళ్ల దయ లేకపోతే ఇక గత్యంతరం లేదని.
నేను డ్రైవింగ్ టెస్ట్ అన్నీ సక్రమం గా చేసినా నన్ను ఫెయిల్ చేసి... ఏజెంట్ ద్వారా రమ్మని వాళ్లే అడ్వైస్ చేశారు. ఎవ్వర్నీ ఏమీ అనలేని నిస్సహాయ స్థితి.
సౌమ్య గారు,
నాకు ఎందుకో చాల భాద గ వుంది మీ పోస్టు చదివాక.
మనం మనకి ఎందుకు గొడవ అనుకుని వదిలెయబట్టే ఇలా జరుగుతోంది.
నేను హైదరాబాదులో లంచం ఇవ్వకుండా LLR , diving license సంపాదించాను. వాల్లు నన్ను పరీక్ష తప్పించినా కూడ మళ్లీ two times driving test కి attend అయ్యి passఅయ్యాను.
whatever might happen i decided i dont want to encourage bribe though the process took a little longer. I felt really satisfied after that.
ఇది కేవలం నా అనుభవం, మన దేశంలో లంచం ఇవ్వకుండా ఇది సాధ్యం అని చెప్పడానికే.
ప్రస్తుతం ఈ క్షణంలో హైదరాబాద్ లో అలాంటి సమస్య ఉండదు సౌమ్య గారూ. సకల జనుల సమ్మె పుణ్యమా అని ఒక్క ఆఫీసూ పనిచేయటం లేదు. సో ఇక్కడ అవినీతి లేనే లేదు. :))))
సౌమ్య గారు,
చాలా చక్కగా వ్రాశారు. నిజాయితీగా బతకాలనుకున్నా వీల్లేకుండా చేసి, ఏదైనా అడిగితే మీరంతా అవినీతి పరులు కాదా అంటున్నారు మరి :(
ప్రభుత్వం లోనే అని కాదు ఎక్కడైనా మనుషులు ఇలా ప్రవర్తిస్తే సామాన్యుడికి దిక్కేది? మనుషులూ మారాలి, మార్పుకి వ్యవస్థా సహకరించాలి. Read this post when you have time http://weekend-politician.blogspot.com/2010/09/blog-post_09.html
It is rotten. Only way out is to fight it to the extent possible and to speak out. You have done both within your limitations.
నేను సైతం .... చేయి తడపకుండా ..marriage certificate తెచ్చుకున్నాను .కానీ ఆ పని కోసం 5 సార్లు రిజిస్టార్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చింది.
నాకు ఇది గుర్తొచ్చింది.
http://www.hitxp.com/articles/society/feelings-of-a-frustrated-indian/
వెన్నెల్లో ఆడపిల్ల గారు,
అభినందనలు. You are brilliant :) Do not get discouraged when things get tough or even when you are forced to compromise. Just give your best to keep it up.
super
Hmm.. Don't know what to say!! :(
హైదరాబాదులో చాలా నయం. నెట్టులో స్లాట్ బుక్ చేసుకోవచ్చు..బ్రోకర్ల అవసరం లేదు.
మా అమ్మాయికి డ్రైవింగ్ స్కూలు ద్వారానే వెళ్ళాం కాని వాడు మధ్యలోనే గాయబ్. మేమే LLR కి ఫైనల్ టెస్టుకి కి ఆన్ లైనులో స్లాట్ బుక్ చేసుకుని విజయవంతంగా లైసెన్సు తెచ్చుకున్నాం. ఏం ఇబ్బంది కలగలేదు మరి!
ఎక్కడైనా ఆన్ లైనులో స్లాట్ బుక్ చేసుకుని టెస్టుకి వెళ్లే సదుపాయం ఉంటుంది కదా!
ఇలా నేను హైద్రాబాదులో సిటీ బస్ నుంచీ ఆర్టీయే ఆఫీసు దాకా, పార్కింగ్ జోన్ నుంచి, GHMC ఆఫీసుదాకా, ట్రాఫిక్ పోలిసు నుంచి ఆధార్ ఆఫీసు దాకా పొరాడి పోరాడి_________ఇంకా పోరాడుతూనే ఉన్నా! ఉంటా కూడా! నీకెందుకు అని ఎన్ని చీవాట్లు పడ్డా సరే.."నాకెందుకు?"అని మాత్రం ఊరుకోలేను.
కానీ ప్రపంచమంతా ఇలాగే లేదు సౌమ్యా! ఎక్కడ చూసినా ఇంతే అని జనరలైజ్ చేయలేం! అవినీతిగా ప్రవర్తించేవాళ్ళ శాతం ఎక్కువగానే ఉన్నా,, నిజాయితీగా పని చేసేవాళ్ళు కూడా చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళని అప్రీషియేట్ చేయడం మాత్రం మర్చిపోను.
సౌమ్య గారు మీరు చెప్పింది నిజమే . ఇంతకన్నా దారుణం పాపం పెన్షన్ తీసుకోవాలంటే బ్రతికి వున్నట్టు సర్టిఫికేట్ కావాలి.వ్యక్తిగతంగా వెళ్ళినా కూడా! పైగా వీళ్ళంతా దేశాన్ని ఉద్దరిస్తున్నట్ట్టు ఫోజు...
మీరు మంచి పని చేశారని నేను అనను. కానీ గత్యంతరం లేదు అని ఒప్పుకుంటాను. వాళ్ళు టెస్ట్ లో ఫైల్ చేస్తే, నాల్గు మాట్లు నాలుగు రోజులు శలవు పెట్టి వెళ్ళేంత ఓపిక తీరుబడి సామాన్యులకి ఉండవు. ప్రతీ విషయానికి పోరాటం చేయలేము. ఎక్కడో అక్కడ సమాధాన పడాలి. తప్పదు.
>>>నెలరోజులలో నేను కారు ఓ మోస్తరుగా నడిపి నేర్చుకునాను.
చిన్న సలహా... డిల్లీ వాసుల మీద కొంచెం జాలి చూపిస్తూ సేఫ్ డ్రైవింగ్ పద్ధతులు పాటించండి. .. అహా
వావ్!!!అవునా!!!పాస్పోర్ట్ చెల్లదా!!!!
అమ్మో ! ఆ.సౌమ్యా... కారు నడుపుతున్నారా ? జాగర్త. కానీ ఢిల్లీ లో డ్రైవింగ్ బావుంటుంది. హైద్రబాదు లో ప్రస్తుతం అవినీతి లేదు. కే.సీ.ఆర్. పుణ్యమా అని.. అందరూ పిల్లా పాపల్తో చల్లగా ఇంటిపట్టునే వుంటున్నారు. బస్సుల్లేక ప్రయాణీకులు టాక్సీలూ, ఇన్నోవాలూ.., ఆటోల్లో దూర ప్రయాణాలకి (ఎక్కువ గా తెలంగాణా ప్రాంతాలకే) వెళ్ళీ వస్తూండటంతో ఇప్పుడు ఎక్కువ అవినీతి ఈ చిన్న బళ్ళలోనే అవుతూంది. ఈ దసరా ఫెస్టివల్ కి టాక్సీ వాళ్ళు నిజంగా లక్షాధికార్లయిపోతారు. :)
btw, అవినీతి అనే కందిరీగ కుట్టని వాడు ఈ భారద్దేశంలో దొరకడం కష్టం. ఆర్.టీ.ఏ వాళ్ళ కార్యాలయం లో కాపోతే ఇంకో చోట. ప్రభుత్వ వ్యవస్థ లో కాపోతే ప్రైవేట్ రంగంలో ! అంతా మిధ్య !
నాకు కూడా డ్రైవింగ్ టెస్ట్లేకుండానే లైసెన్స్ వచ్చేసింది. నిజానికి అసలు నేను ఆఫీసుకి వెళ్ళకుండానే. పైసామే పరమాత్మ.
సౌమ్య గారు నాకొచ్చిన ఒక మెయిల్ లో అన్న హజారే చేసిన పెద్ద తప్పు గురించి ప్రస్తావించారు . జన లోక్ పాల్ బిల్లు ఆమోదించక పోవడానికి కారణం అన్న హజారే లంచం ఇవ్వక పోవడమే నట ..... మీరు గమనించారో లేదు మరీ ఢిల్లీ లో హజారే దీక్షకు మద్దతు ఇచ్చిన వారిలో ఆర్ టి ఏ సిబ్బంది ముందు వరుసలో ఉండే ఉంటారు
శశి గారూ
ధన్యవాదములు!
హహహ మీకూ ఇలాంటి అనుభవమే అయ్యిందా...బాగు బాగు
@కృష్ణప్రియ గారూ
అయ్యో వాళ్ళే చెప్పారా ఏజెంట్ దగ్గరకెళ్ళమని? ఇదీ మరీ విచిత్రం. మీరన్నట్టు మనకు వాళ్ళే దిక్కని అలా పేట్రేగిపోతున్నారు.
@వెన్నెల్లో ఆడపిల్ల గారూ
మీరు చేసిన పని కి సెబాసులు....మంచి పని చేసారు...అభినందనలు!
కానీ అది హైదరాబాదు కాబట్టి సాధ్యం అయిందండీ. నేను హైదరాబాదులో ఒకసారి లెర్నెర్ తీసుకున్నాను. చాలా సులువుగా గంటలో పనయిపోయింది. ఏ అవమానమూ పొందలేదు, ఏ బాధ పడలేదు. ఇక్కడ ఢిల్లీ పరిస్థితి వేరు. ఇక్కడ పాస్ పోర్ట్ చెల్లదు అంటే ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుందో. ఈ మనుషులు, వాళ్ళ తత్వాలు అన్నీ వేరు. టెస్ట్ ఫైల్ చెయ్యడం వరకూ ఎందుకు వీళ్ళు అసలు మనుషులతో సరిగ్గా మాట్లాడరు. కసరడమో, అరవడమో తప్ప మామూలుగా మాట్లాడరు. సమాధానం చెప్పరు. అడుగడుగునా లంచం. ఎంతకని ఓర్చుకుంటాం! ఢిల్లీ లో నాకు ఇలాంటి అనుభవాలు చాలానే జరిగాయి.
@శంకర్ గారూ
హహహ ఒకప్పుడు నాకు హైదరాబాదు స్వర్గధామంగా కనిపించేది. ఇప్పుడు అలా లేదేమో పరిస్థితి!
@Weekend Politician గారూ
ధన్యవాదములు!
మీ పోస్ట్ చూసాను, బావుంది.
నిజమే, పరిస్థితి మరీ దిగజారిపోతున్నాది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది అనివార్యమేమో!
మనం ఎంత ఫైట్ చేసినా వాళ్ళు దులిపేసుకుంటారండీ. నేను చూసానుగా!
ఇది ఎలా మారుతుందో, ఎలా మార్చడమో తెలియట్లేదు. ఎన్నాళ్ళని, ఎంతకని పోరాడుతాం! అలా అని చూస్తూ ఊరుకోలేము. దీనికి ఒక్కటే solution...ప్రజల తలసరి ఆదాయం పెరగాలి. అలా పెగరాలంటే దేశం అభివృద్ధి చెందాలి. We are on the way...lets hope for the best!
శ్రీరామ్ గారు
మంచి పని చేసారు..అభినందనలు!
నాకు తెలిసి రిజస్టార్ ఆఫీసులో పని కొంచమ తేలికండీ. మా ఇంట్లో కూడా చేయి తడపకుండా పెళ్ళి పత్రం తెచ్చుకున్నవాళ్ళున్నారు. RTO లోనే లంచం మరీ ఎక్కువ.
@Indian Minerva
Thanks! yeah..i have read this before. good one!
@పక్కింటబ్బాయి (ఇల్లు మారాడు) గారూ
:))
@ మధుర
హ్మ్ :(
@ సిరిసిరిమువ్వ గారూ
నిజమే, హైదరాబాదు చాలా నయం. లంచం అంత వ్యాపించలేదు. నేను HYD లో LLR చాలా సులువుగా తెచ్చుకున్నాను. గంటలో వచ్చేసింది.
@ సుజాత గారూ
హ్మ్ మనం ఇలా పోరాడుతూ ఉండడమే..ఇంకేం చెయ్యగలం చెప్పండి.
అన్నిచోట్లా ఇలాగే ఉందని చెప్పట్లేదుగానీ ఢిల్లీలో మాత్రం 90% ఇలాగే ఉందండీ. నేను చూసిన అన్ని నగరాలకన్నా ఢిలీ the worst!
బాగా పని చేసినప్పుడు appriciate చేస్తూ మీరు మంచిపని చేస్తున్నారు. అలా భుజం తడితే అదైనా మారుస్తుందేమో వాళ్ళని.
@ఛాయ గారూ
అవునండీ పెన్షన్ ఆఫీసుల గురించి విన్నాను. అక్కడ మనుషుల్ని కాల్చుకు తింటారట కదా, ప్చ్ పాపం!
@బులుసు గారు
నిజమేనండీ, గత్యంతరం లేదు. ఏజెంట్ ద్వారా వెళ్ళి లైసెన్సు తెచ్చుకుంటున్నప్పుడూ ఎంత గిల్టీ గా ఫీల్ అయ్యానో నాకే తెలుసు. ముఖ్యంగా డ్రైవింగ్ టెస్ట్ కూడా చెయ్యకుండా లైసెన్సు వచ్చిందంటే చాలా బాధగా అనిపించింది. ఆరోజు బాగా గిల్టీగా ఫీల్ అయ్యాను, కాని ఏం చెయ్యగలం. అన్నిసార్లు ఆ ఆఫీసు చుట్టూ తిరిగే ఓపిక, టైము లేదు.
హహ మీ సలహాకి ధన్యోస్మి!
అయ్యయో.. ఈ పోస్ట్ ఎలా మిస్సయ్యితినీ?
షేం టూ షేం ఇలాంటి ఎక్పీరియన్స్ నే నాకూ అయ్యిందీ.
మా ఫ్రెండ్స్ అందరం లైసెన్స్ కోసం వెళ్ళాం. నేను మా చిన్నమామ సలహా మీద బ్రోకర్ గాడికి వెయ్యి సమర్పిమ్చుకొని వెళ్ళాను. మా ఫ్రెండ్ గాడు నేను భీభత్సమయిన డ్రయివర్ నీ నేను న్యాయ బద్ధంగా వెళతాను అన్నాడు.
వాణ్ణి రిటెన్ టెస్ట్ కి ముందే నాలుగు ప్రశ్నలడిగి నెలరోజుల తర్వాత రా అని పంపేశాడు చాలా రూల్స్ మాట్లాడి. కానీ నన్ను మాత్రం రాజావారిలాగా ట్రీట్ చేశాడు. నా బదులు వాడే నాలుగు ఆప్షన్స్ టిక్ పెట్టేసీ ఎగ్జామ్ అవ్వగొట్టేశాడు. డ్రయివింగ్ టెస్టా? వల్లకాడా? అవేం లేకుండా ఆ రోజే లెర్నర్, నెలరోజుల్లో లైసెన్స్ వచ్చేసిందీ. అదీ మ్యాటర్
నీతిగా బతకాలని మనమనుకున్నా బతకనివ్వరు లెండీ.
మీ స్టైల్ లో బాగా రాశారు సెగట్రీ గోరూ.. ;)
ఇంకో విషయం గుర్తొచ్చిందీ.
నేను పాస్పోర్ట్ కి అప్లై చేసుకునేటప్పుడు. ఆఫీస్ బయట అప్ప్లికేషన్స్ అమ్మే, జెరాక్స్ షాపుల వాళ్ళచేత ఫిల్ చేయిస్తే వంద అంటా.
ఫస్ట్ టైం "ఆ మాత్రం అప్ప్లికేషన్ మేము ఫిల్ చేసుకోలేమా?" అని సొంతంగా ఫిల్ చేశాం. వెళ్ళిన వాళ్ళందరినీ కొన్ని గంటల సేపు లైన్ లో నించున్నాక అది తప్పూ, ఇది తప్పూ అని బయటకి తోసేశారు.
తర్వాత వాళ్ళ చేత ఫిల్ చేయించీ డబ్బుల్ సమర్పిమ్చుకున్నాకా ఓకే అయ్యిందీ. మరి ఇందులో ఏమయినా అండర్ స్టాండిగ్స్ ఉన్నాయేమో తెలీదు. బ్రోకర్స్ గురించి గుర్తొచ్చి చెప్పాను ;)
@ ఎన్నెల గారూ
అవునండీ పాస్ పోర్ట్ చెల్లదు. ఇది విని నేను కూడా మీలాగే నోరు తెరిచాను!
@Sujata గారు
ఏదొ అనడుపుతున్నానండీ. బిజీ రోడ్లపైకి ఇంకా వెళ్లట్లేదు...ధైర్యం చాలట్లేదు. ఢిల్లీలో కార్ నడపడం నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా నడిపేయొచ్చు :P
మీరన్నది కరక్టే ఆ కందిరీగ కుట్టనివారు లేరు. :)
@ మురళి
వాహ్ ఇది మరీ టూ మచ్ గా ఉంది. మీరు అసలు వెళ్లకుండానే లైసెన్సు వచ్చిందా...వాహ్ వాహ్...మన వ్యవస్థని అభినందించకుండా ఉండలేకపోతున్నాను.
@బుద్ధ మురళి గారూ
ఆ మైల్ నాకూ వచ్చిందడీ, చదివి నవ్వుకున్నాను :)
మరే, ఓ పక్క అన్నా హజారేకి జై అంటూనే మరో పక్క జేబులు నింపేసుకుంటుంటారు.
@ వేణూరాం (రాజ్)
అవునా! నీకూ ఇదే అనుభవమా...భేష్ భేష్!
చెప్పాను కదా ఆ టెస్ట్ లో నాకు చాన్స్ ఇవనేలేదు. ఆ ప్రశ్నలు నేను చదవనేలేదు. టకటకా టిక్కులు పెట్టేసాడు వాడే.
పాస్ పోర్ట్ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ. హైదరాబాదులో తీసుకున్నాను. చాలా సాఫీగా జరిగిపోయింది వ్యవహారం. "అప్ప్లికేషన్ నింపడానికి వంద రూపాయిలు"...ఇది నేనూ చూసానుగానీ నేను వాడి దగ్గరకి వెళ్లలేదు. నేనే నింపి ఇచ్చాను. ఏ సమస్య లేకుండా నెల రోజుల్లో పాస్ పోర్ట్ చేతికొచ్చేసింది. ఇంకోటి పోలీస్ వెరిఫికేషన్ కి వస్తారు కద అప్పుడు పోలీసులు ఓ వందో, రెండొందలో నొక్కేస్తారట. నా అదృష్టం ఏమిటంటే నేను అప్పటికి యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి నన్నేమీ అడగలేదు. మా సెక్యూరిటీ ఆఫీసార్ ష్యూరిటీ ఇచ్చేసరికి నన్నేమీ అడక్కుండా పనిచేసుకుని వెళ్ళిపోయారు.
//ఢిల్లీలో కార్ నడపడం నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా నడిపేయొచ్చు .//....నేనొప్పుకోను...ఇండియాలో 20 యేళ్ళు, పాకిస్తాన్ లో 25 యేళ్ళు నడిపి వచ్చిన వాళ్ళందరూ కెనడాలో డ్రయివింగ్ పరీక్ష గోల్...
అవినీతి అధికారుల లిస్టు కోసం ఇక్కడో లుక్కెయ్యండి
http://www.corruptionfreeap.org/corrupted_officers.html
మా ఊరిలో అర్టీవో ఆఫీసులో ఏజంటుగా మా ఫ్రెండే పని చేస్తాడు. ఒకసారి నాకు కనిపించి నీకు ఇంటర్నేషనల్ లైసెన్స్ కావాలంటే చెప్పు, ఇంటికి పంపుతాను అని చెప్పాడు. వడ్డించేవాడు మన వాడయితే లడ్డు, మైసూరుపాకులు మీరు అడగకపోయినా పెడతారు.
హ్మ్మ్మమ్మ్మ్మమ్మం
ఎంతో అనుకుంటాం కదా మనం ఇలాంటి పనులు చేయకూడదు అని..కానీ మన అవసరాలను బట్టి..చేసేయాల్సి వస్తోంది...
మీరు ఢిల్లీ గురించి చెప్తున్నారు..
మాది చిన్న టౌన్...అక్కడే ...పెద్ద మొత్తాలు లాగేస్తున్నారు...లైసెన్స్ ఇవ్వడానికి..
ఆలా పోలిస్తే మీకు చవకగా వచ్చినట్లే..!!
కాస్త పెద్ద వాళ్ళకి ,ప్రాణం మీద భయం ఉన్నవాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసిన పర్లేదు...జాగ్రత్తగా నడుపుతారు...
కానీ కాలేజీ పిల్లలకు ఇచ్చేస్తున్నారు ఇలా....వాళ్లకి ఇక హద్దులు లేకుండా నడిపేస్తూ ప్రణాల మీదకి తెచ్చుకుంటున్నారు..!!
I went thru similar exercise of getting my license transfered from Vizag and also renewing it. Because of the process it took three trips to the office, but I am proud to say, I got it with out paying a penny extra than stipulated. I am glad it worked out for me, as I had a planned trip to Visakhapatnam, I could get my NOC with out crying for that additional expenditure :)
I see brinery (in most of the cases) as, our urgency cashed by the otherside on the table. Not to single out RTO, wherever you go, it is all driven by our urgency to get things done, or at times, laziness :)
Regards
Ram
@ సీతారాం గారూ
మీకు ఖర్చు పెట్టకుండా సవ్యంగా లైసెన్సు లభించినందుకు సంతోషం.
మీరన్నట్టు urgency, బద్దకం అని జనరలైజ్ చేసి చెప్పలేమేమోనండీ. కొందరు కి కావొచ్చు. నా విషయంలో మటుకు నాకు తొందరా లేదు, బద్దకం అంతకంటే చూపలేదు. బోల్డు సార్లు వెళ్ళాను RTO ఆఫీసుకి. అలాగే నాకు తొందరేం లేదు. ఎప్పుడొస్తే అప్పుడే తీసుకుందామనుకున్నాని. అయినా పరిస్థితులు అనుకూలించలేదు...హ్మ్!
సౌమ్య గారూ,
మీకు తొందర లేక, బద్ధకము (ఇది చాలా తీవ్రము గా ఉంది, అంచేత మళ్ళీ మళ్ళీ వెళ్ళే ఓపిక, మరియు వీలు అనుకుందాము), లేకపోతే మరి లంచము ఇచ్చి ఎందుకు పనిచేయించుకున్నారు? ఒక అధికారి వల్ల కాకపొతే పై అధికారి దగ్గరకు వెళ్ళవచ్చు కదా?
ఇలా అన్నానని నేను ఎప్పుడూ లంచాలు ఇవ్వలేదనుకోకండి. నేనూ ఇచ్చాను, కాకపోతే అప్పుడు నాకు తొందర మరియు/లేక బద్ధకము ఉన్నాయి..
కానీ, రాను రానూ నాలో పని తిన్నగా ఎందుకు చేయించు కోలేము అన్న పట్టుదల పెరుగుతోంది. దరిమిలా నేను అవుట్ అఫ్ ది వే లో పనులు చేయించు కోవట్లేదు. దాని వల్ల కొంత డబ్బు, మరియు శ్రమ తగులుతున్నాయి. అట్లే అగు గాక :)
సీతారాం
సీతారాం గారూ
నా విషయం వరకూ వస్తే నేను ఉద్యోగిని...ఆఫీసుకు టైముకు వెళ్ళాల్సి ఉంటుంది. చాలా శనివారాలు వాళ్ల చుట్టూ తిరిగాను...కుదరక లంచాన్ని ఆశ్రయించవలసి వచ్చింది.
ఇంకో మాట: వాళ్ళతో గొడవపడినవాళ్ళని రెండో సారి, మూడో సారి కూడ డ్రైవింగ్ టెస్ట్ లో ఫైల్ చేసిన కథలు విన్నాను. దాని గురించి ఏమంటారు? ఓపిక, తీరిక రెండూ ఉండి కూడా కేవలం ఆ RTO ఉద్యోగుల అహంభావం వల్లనే లైసెన్సు పొదలేక లంచాన్ని ఆశ్రయించిన వారి సంగతులు విన్నాను. మరి వారి సంగతి?
అసలు ఇదంతా కాదు. చాలా సులువుగా అయిపోవలసిన పని...నేను బాగా డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు న్యాయంగా రావలసిన లైసెన్సు ఎందుకు రావట్లేదు? దానికి నేను బోలెడంత శ్రమని, సమయాన్ని, నా శక్తి ని ఎందుకు ధారపొయ్యాలి? ఈ కోపం ప్రతీ ఒక్కరిలోనూ ఉటుననుకుంటా...అందుకే లంచాన్ని ఆశ్రయిస్తున్నారు.
మీరు చెప్పినదాన్లోనూ పాయింట్ లేకపోలేదు. కొందరు డబ్బున్నవాళ్ళ ఓపిక తీరిక లేమి లంచాలను ప్రోత్సహించి ఉండవచ్చు.
లంచాలు రూపుమాపడం ఏ ఒక్కరూ ఉద్యమిస్తే అయ్యే పని కాదండీ. సమాజం మొత్తం ఉద్యమించాలి. ఒకవేళ ఉద్యమించినా అవ్వకపోవచ్చు ఆర్థిక అసమానతలు మెండుగా ఉన్నంతవరకు. నేను పోస్టులో చెప్పినట్టు తలసరి ఆదాయం పెరిగి అభివృద్ధి జరిగితే లంచాలు చాలావరకూ తగ్గవచ్చు.
Post a Comment